రంగనాయకసాగర్‌కు చేరుకున్న కాళేశ్వర గంగ

కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమైంది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వచ్చేశాయి. పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం అయింది.  


సిద్ధిపేట రైతుల కల సాకారమైంది. ఇన్ని రోజులు బీడువారిన భూములకు గంగమ్మ తల్లి అడుగీడింది. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం, మంత్రి హరీశ్‌రావు నిరంతర శ్రమ ఫలించాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగసాయక సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌ల వెట్‌రన్‌ను ప్రారంభించడంతో గంగమ్మ సిద్దిపేట జిల్లాలో అడుగు పెట్టింది. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టుతో సిద్ధిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందనుంది. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మూడు టీఎంసీలు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని లక్షా 14వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.